(5) గాలికి లోటున్నదా?
(5) గాలికి లోటున్నదా?
సన్యసించాలనే తీవ్ర వైరాగ్యం గల వారికి కూడా సన్యసించే సమయంలో
తెలుస్తుంది సన్యసించడ మనేది అంత తేలికైన కార్యం కాదని. ఆ విషయంలో నేను
విలక్షణంగా లేను,
ముప్పై ఆరు సంవత్సరాలు ఉమ్మడి కుటుంబంలో కుటుంబం లేని సభ్యుణ్ణిగా
కొనసాగాను. క్షణంలో ఏకాకి నయ్యాను. ఆ క్షణంలో ఏదో అనిపించింది. కొన్ని
నిమిషాలు అభద్రతా భావం చోటు చేసుకుంది. జ్వర మొస్తే, మందెవరిస్తారు? ఆహారం
లభించక పోతే ఆకలిని భరించే దెలా? బట్టలు ఎవ్వరు ఇవ్వకుంటే తుండుగుడ్డ
చుట్టుకొని తిరగ గలనా? ఇలాంటి ప్రశ్నలు నా మనస్సును ముసురు కున్నది మాత్రం
వాస్తవం. అంతా కొన్ని నిముషాలే.
విశ్వనాథ స్వామి ఆలయంలో నిలబడలేక కూర్చుండి పోయాను. బుద్ధి
మొద్దుబారి నట్లైంది. ఈ అనుభవము కూడా నా జీవితంలో ఉంది.
అలా చూస్తూ ఉండగానే ధ్వజ స్తంభము దగ్గర నుండి ఒక కాకి పైకి ఎగిరింది.
నాకు కబురందించేందుకే ఎగిరిందేమో అని ఇప్పు డనిపిస్తుంది.
ఈ పక్షికి ఎవరున్నారు? దీని దేవూరు? ఇదెవరికి సంబంధించింది? దీనికి
జ్వర మొస్తే? ఆకలై ఆహారం లభించకపోతే? ఇలా ప్రశ్నలపై ప్రశ్నలు ఉరికురికి పడ్డాయి.
నా ప్రశ్నలకు సమాధానం లభించినట్టైంది. పక్షికి లేని అభద్రత నాకెందు కొచ్చింది?
తన రెక్కల్ని నమ్ముకొని పక్షి అంత ఆనందంగా విహరించే టప్పుడు, భగవంతుణ్ణి
నమ్ముకున్న నేను ఆనందంగా సంచరించలేనా? అని ప్రశ్నించుకోగానే కూలబడ్డ నేను
లేచి నిలబడ్డాను. అంతే, ఆనాటి నుండి నేటి వరకు అలాంటి అభద్రత మళ్ళీ నా
జీవితంలో తలెత్త లేదు. పక్షి ఎగిరిన సన్నివేశాన్ని గుర్తు చేసుకొని వ్రాసిందే ఈ పాట.
పల్లవి:
గాలికి లోటున్నదా? ఏటికి పోటున్నదా?
మంచిని తెలిసి సమతను పిలిచే
మనిషికి కొర తున్నదా?
1. పువ్వుకు మనసున్నదా?
నవ్వుకు వయసున్నదా?
నువ్వు నే ననే భేదము చూసే
బ్రతుకుకు సొగసున్నదా?
2. పక్షికి ఊరున్నదా?
అక్షికి నోరున్నదా?
మచ్చిక తెలిసి మనుగడ నడిపే
కుక్షికి కరువున్నదా?
3. మబ్బు మెరయ కుండునా!
జల్లు కురియ కుండునా!
భక్తి ప్రేమలు మనసున నిలువగ
ముక్తి లభించ కుండునా?
సమతను పిలిచే
మనిషికి కొర తున్నదా?