Friday, February 7, 2025

(4) బ్రతుకు బొమ్మలాట

 (4) బ్రతుకు బొమ్మలాట

అప్పుడు నాకు పదహారు సంవత్సరాలు. ఎస్.ఎస్.ఎల్.సి. చదువుతున్నాను.

మా తండ్రి మరణించాడు. మా అన్నగారికి ఇరవై ఆరు సంవత్సరాలు. ఆయన జీతమే

ఇక అందరికీ ఊపిరైంది. మా తమ్ముడికి ఆరు సంవత్సరాలు. ఇంకా అతణ్ణి బడికి

పంపలేదు. అకస్మాత్తుగా జరిగిన ఆ సంఘటన పసి హృదయాలపై పిడుగు పడినంత

పని చేసింది.

తండ్రి పార్థివ దేహం కాలుతూ ఉంటే సమీపంలో ఉండి చూశాను. కళ్ళ

ముందే బూడిదగా మారిన తండ్రి శవం నా మనస్సుపై చెదరని ముద్రను వేసింది.

ఏనాడైనా, ఎవరి శవమైనా శ్మశానంలో పిడికెడు బూడిదగా మారుతుందనే నగ్న సత్యాన్ని

కనీసం వల్లకాటిలో నైనా గుర్తిస్తారేమో అనే భావన తోనే హిందూ సంప్రదాయంలో

తండ్రి శవానికి కొడుకు చేత నిప్పు పెట్టిస్తారని ఈ రోజు వేదికలపై నేను పలికే

వాక్యానికి నాంది ఆ సన్నివేశమే.

ఆ తరువాత ఇరవై సంవత్సరాలు దొర్లిపోయాయి. నాకు ముప్పై ఆరు

సంవత్సరాలు. మా తల్లి గతించింది. తండ్రిని దహనం చేసినట్లు తల్లిని దహనం

చేయలేదు, మా వంశ సంప్రదాయానికి భిన్నంగా ఆమె పార్థివ దేహాన్ని పూడ్చి పెట్టడం.

జరిగింది.

కారణం ఏదో కాదు. అప్పట్లో మా ఊరిలో రామలింగ స్వామి ఆలయంలో

నేను ఉపన్యాసాలు చెబుతూ ఉంటే, వినే శ్రోతలలో ఆమె కూడా ఒకతె. ఆలయానికి

సమీపంలో, దారి ప్రక్కన ఆమె అంత్యక్రియలు జరగటం చేత, అలా చేయవలసి

వచ్చింది.

ఎవరి చేతుల్లో నేను ప్రేమగా పెరిగానో, ఆమె దేహంపై నేను మట్టి వేసినపుడు

తీవ్రంగా చలించి పోయాను. నదీస్నానం చేసి ఆలయంలో దర్శనం చేసుకొని తిరిగి

వస్తూ ఉంటే, నా మనస్సులో కొన్ని భావాలు వేగాన్ని పుంజుకున్నాయి.

ఇదే సత్యం, ఎవరి జీవితమైనా ఇంతే. తెచ్చుకున్నది మట్టే. తిరిగి ఇచ్చుకొనేదీ

మట్టే, ఇక మన ప్రయాణం మారాలి; అని నిశ్చయించుకున్నాను. అంతే. ఆరు నెలలు

తిరుగక ముందే మద్రాసు వెళ్ళి శ్రీశ్రీశ్రీ శుద్ధానంద భారతీ స్వాముల వారిని కలిసి

వారి ఆశీస్సులు తీసుకొని ఇల్లు వదిలిపెట్టి ఒంటరిగా ధవళేశ్వరం చేరి ఆశ్రమాన్ని

ప్రారంభించాను.

పూజ్యులు శ్రీ శుద్ధానంద భారతీ స్వాముల వారు నూట నాలుగు సంవత్సరాల

వయస్సులో స్వయంగా వచ్చి స్వహస్తాలతో ఆశ్రమాన్ని ప్రారంభించి ఆశీర్వదించారు.

'Sudha and Sundara shall be one in Krishna Consciousness' అని ఆ 

సందర్భం లోనే వేలాది శ్రోతల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు.

తండ్రి గారి కంటే తల్లి మీదనే నాకు ప్రేమ ఎక్కువగా ఉండేది. ఆమెపై మట్టి

వేసిన ఆ తుది సన్నివేశం స్మృతిలో మెదిలినపుడు వ్రాసిందే ఈ పాట.

పల్లవి:

బ్రతుకు బొమ్మలాట విధి నడిపే వింతలే

విను నా మాట ఇలలో ఆట

అనుపల్లవి:

ఇంతేనా జీవిత మంతేనా?

చింతేనా - జీవికి చింతేనా?

చరణములు:

1.దేవు డిచ్చింది మట్టి ఒక్కటేలే

కట్టు కున్నప్పుడే మేడ ఔతుందిలే

ఏదో ఓనాడు కూలిపోతుందిలే

చివరికి తన వారు వేసేది మట్టేలే

2.రాలేవి ఆకులు కూలేవి మాకులు

అన్నీ గారడీలు మిగిలేవి గాయాలు

గమనాన్ని మార్చుకో- గమ్యాన్ని చేరుకో

నీలో నీవు నిండుగా ఉండిపో!


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home